పుస్తకాలు మనిషికి విజ్ఞానాన్ని అందిస్తే, ఆత్మ కథలు అనుభవాలని భోదిస్తాయి. తెలుగులో తప్పక చదవ వలిసిన ఆత్మ కథలు కొన్ని ఉన్నాయి. వీరి జీవితం లో ఆటు పొట్లు, ఎత్తు పల్లాలు, క్లిష్ట సమయాలలో వీరు తీసుకున్న నిర్ణయాలు మనల్ని వెన్నుతట్టి నడిపిస్తాయి. మన ఆలోచనా దృక్పదాన్ని మారుస్తాయి. ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా చదవ వలిసిన ఆత్మ కథలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
![]() |
Telugu Books : Biography |
"నాకూ ఉంది ఓ కల" - ఇది మన దేశంలో క్షీర విప్లవ పితామహుడిగా పేరు గాంచిన వర్గీస్ కురియన్ గారి ఆత్మకథ. తెలుగులో కూడా ఉంది. ఒక సహకార సంఘ వ్యవస్థను నిర్మించడానికి ఓ మేధావి పడ్డ తపన ఎలా ఉంటుందో ఈ పుస్తకం మనకు తెలియజేస్తుంది.
నా ఎరుక - హరికథా పితామహుడు ఆదిభట్ల నారాయణదాసు గారి ఆత్మకథ ఇది. అందరూ తప్పక చదవాల్సిన పుస్తకం. ఒక కళాకారుడి హృదయ నివేదన ఈ రచన.
బతుకు పుస్తకం : ఉత్తరాంధ్ర సాహితీవేత్త, వృక్ష శాస్త్ర నిపుణుడు ఉప్పల లక్ష్మణరావు గారి ఆత్మకథ ఇది. ఒక సామ్యవాదిగా లక్ష్మణరావు ఎదుర్కొన్న అనుభవాలు, జీవితంలో పడ్డ ఆటుపోట్లు.. విప్లవ రచయితగా ముందుకు సాగిన వైనం.. ఇవన్నీ ఈ పుస్తకంలో మనకు దర్శనమిస్తాయి.
అనంతం : మహాకవి శ్రీశ్రీ గారి ఆత్మకథ ఇది. ఆయన జీవితంలోని ఎన్నో కోణాలను ఆవిష్కరింపజేసిన రచన.
యాది : తెలంగాణ కథకుడు, సంగీత విద్వాంసుడు శ్రీ సామల సదాశివ గారి ఆత్మకథ ఇది. "వెనకటితరం పెద్దమనుషులు చెప్పే ముచ్చట్లు వినముచ్చటగా ఉంటాయి. శంఖాన్ని చెవికి ఆనించుకుంటే సముద్రపు హోరు వినిపించినట్లు ఆ కాలంనాటి కథలన్నీ కళ్ళముందు కదలాడుతాయి" అన్న వాక్యాలు ఈ పుస్తకం మీద మనకు మరింత ఆసక్తిని కలిగిస్తాయి
అనుభవాలు జ్ఞాపకాలు : "ఏ జాతి యెదటా ఏ సందర్భంలోనూ ఎందుకున్నూ నా తెనుగుజాతి తీసిపోదు" అంటూ తెలుగు కథను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లిన మేటి రచయిత శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి ఆత్మకథ ఈ పుస్తకం.
ఓ హిజ్రా ఆత్మకథ : - "ఐ వాజ్ బార్న్ టు సర్వైవ్" అంటూ హిజ్రాల హక్కుల కోసం గళం విప్పిన ధీరవనిత రేవతి. హిజ్రాలకు కూడా సామాన్య మనుషుల్లా బ్రతకాలని ఉంటుందని.. మగ శరీరంలో స్త్రీ మెదడుతో పుట్టడం తమ తప్పు కాదని చెబుతూ.. తాను తమ హక్కుల పోరాటం కోసం ఎన్ని అగచాట్లు పడిందో హృద్యంగా తెలిపిన ఆమె ఆత్మకథ "ది ట్రూత్ ఎబౌట్ మి". ఆ పుస్తకానికి తెలుగు అనువాదమే "ఓ హిజ్రా ఆత్మకథ"
ఒక విజేత ఆత్మకథ - ప్రముఖ అణు శాస్త్రవేత్త, భారతరత్న అబ్దుల్ కలామ్ స్వయంగా రాసుకున్న ఆత్మకథ "వింగ్స్ ఆఫ్ ఫైర్". దాని తెలుగు అనువాదమే "ఓ విజేత ఆత్మకథ". ఈ పుస్తకంలో ఆయన ఎంత కష్టపడి ఇంజనీరింగ్ పూర్తి చేసి మంచి విద్యార్థిగా పేరు తెచ్చుకున్నారో తెలియజేశారు. తన కెరీర్ విషయాలతో పాటు తన ఉద్యోగానుభవాలు, మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ఆయన ఎదుర్కొన్న సవాళ్లు.. ఇస్రోతో ఉన్న అనుబంధం... పోఖ్రాన్ అణు పరీక్షలో తన పాత్ర.. ఇలా అన్ని విషయాలను కూడా చాలా లోతుగా చర్చించిన పుస్తకం ఇది. తప్పకుండా ప్రతీ యువకుడు చదవాల్సిన పుస్తకం.
ది డిస్టార్టెడ్ మిర్రర్ - ప్రముఖ కార్టూనిస్ట్ ఆర్కే లక్ష్మణ్ కలం నుండి జాలువారిన ఆత్మకథ ఇది.
ఇన్ ద ఆఫ్టర్ నూన్ ఆఫ్ టైమ్ - ప్రముఖ కవి, రచయిత హరివంశ రాయ్ బచ్చన్ గారి ఆత్మకథ ఇది. తప్పక చదవాల్సిన రచన.
ప్రతీ ఆత్మ కథ మనకు ఎన్నో జీవిత సత్యాలు భోదిస్తుంది.
- బాబు కోయిలాడ, (వ్యాస రచయిత ప్రముఖ జర్నలిస్ట్ )
Post a Comment